కేటీఆర్ చెప్పారు.. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే: పాడి కౌశిక్‌రెడ్డి

  • గవర్నర్ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తున్నారన్న కౌశిక్‌రెడ్డి
  • శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును ఆపడం ఏంటని ఆగ్రహం
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈటలను ఆహ్వానిస్తామన్న బీఆర్ఎస్ నేత
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయబోయేది తానేనని బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా చెప్పారని పేర్కొన్నారు. కరీంనగర్‌లో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై తనకు అపార గౌరవం ఉందన్న ఆయన.. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను గవర్నర్ పాటిస్తే మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. 

శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును ఆపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆమె చర్యలపై అసంతృప్తితోనే గవర్నర్‌పై విమర్శలు చేసినట్టు చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు మాట్లాడే భాషపై ఆ పార్టీ సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని త్వరలోనే మంత్రి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గౌరవంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.


More Telugu News