ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

  • వైసీపీలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చన్న బాలినేని
  • అది ఫోన్ ట్యాపింగ్ కాదు... ఫోన్ రికార్డింగ్ అని వ్యాఖ్య
  • కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తెస్తామన్న బాలినేని
ఏపీ రాజకీయాల్లో వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఏకంగా పార్టీ అధిష్ఠానంపై ఆయన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశంలేదని ఆయన అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ నిజం కాదనే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ... వైసీపీలో ఉండటం ఇష్టం లేకపోతే కోటంరెడ్డి పార్టీని వీడి పోవచ్చని చెప్పారు. 

కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో ట్యాప్ చేసింది కాదని... అది రికార్డ్ చేసిందని అన్నారు. అది రికార్డ్ చేసిన ఆడియో అని నిరూపితమైతే కోటంరెడ్డి రాజకీయాలను వదిలేయాలని సవాల్ విసిరారు. వాస్తవాలను నిరూపించడానికి కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు తనకు, తన స్నేహితుడికి మధ్య ఫోన్ కాల్ ట్యాప్ అయిన ఆడియోను ఈరోజు కోటంరెడ్డి మీడియా ముఖంగా విడుదల చేశారు. తామిద్దరం ఐఫోన్ వాడుతున్నామని, ఐఫోన్ లో రికార్డింగ్ సదుపాయం ఉండదని... అలాంటప్పుడు ఈ ఆడియో ఎలా వస్తుందని కోటంరెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.


More Telugu News