లోకేశ్ ను అంకుల్ అంటూ విమర్శలు గుప్పించిన రోజా

  • ఏం చేయబోతున్నారో చెప్పకుండానే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారన్న రోజా
  • తండ్రిని మళ్లీ సీఎం పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నారని మండిపాటు
  • నాయకుడిగా లోకేశ్ ఫెయిల్యూర్ అని విమర్శ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన లోకేశ్ అంకుల్ తన తండ్రి రాష్ట్రానికి ఏం చేశారో, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారని చెప్పారు. లోకేశ్ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నారని, ఇప్పుడు మళ్లీ ఆయన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై చంద్రబాబు వేధించినప్పటికీ జగనన్న ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించారని... పేదల కష్టాలను విన్నారని, అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలను తీర్చారని చెప్పారు. ఆ ధైర్యంతోనే తనకు మళ్లీ ఓట్లు వేయాలని జగనన్న అడుగుతున్నారని అన్నారు. 

తండ్రీకొడుకులు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరిస్తున్నారని రోజా విమర్శించారు. సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే లోకేశ్ పాదయాత్రలో 10 మంది కూడా ఉండరని అన్నారు. నాయకుడిగా లోకేశ్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఇది గుర్తించే మంగళగిరి ప్రజలు లోకేశ్ ను ఓడించారని అన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా గెలవలేని రికార్డు లోకేశ్ దే నని ఎద్దేవా చేశారు.


More Telugu News