నింగిలో ఆకుపచ్చని తోకచుక్క.. నేడు రేపు

  • బైనాక్యులర్ సాయంతో స్పష్టంగా చూడొచ్చు
  • భూమికి సమీపంగా వస్తున్న సీ/2022 ఈ3 (జెడ్ టీఎఫ్)
  • నేడు, రేపు కనిపించనున్న తోకచుక్క
  • 50వేల ఏళ్లకోసారి ఈ భాగ్యం
ఆకుపచ్చ రంగు అద్దుకున్న ఓ తోక చుక్క నింగిలో దర్శనమివ్వనుంది. జీవితంలో ఒకేసారి చూడగలిగిన తోక చుక్క ఇది. ఎందుకంటే తరచూ వచ్చేది కాదు. మళ్లీ దీన్ని చూడాలంటే 50 వేల సంవత్సరాల తర్వాతే సాధ్యపడుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి దీనికి ఇంత కాలం పడుతుంది. సౌర వ్యవస్థ వెలుపల తిరుగుతుంది. ఈ తోకచుక్క పేరు సీ/2022 ఈ3 (జెడ్ టీఎఫ్). రాతి యుగం తర్వాత ఇది కనిపించడం ఇదే మొదటిసారి. 

ఖగోళ శాస్త్రవేత్తలు 2022 మార్చి 2న దీన్ని గుర్తించారు. క్యాలిఫోర్నియాలోని శాన్ డీగో పాలోమర్ అబ్జర్వేటరీ నుంచి కెమెరాల సాయంతో దీన్ని చూశారు. ఇది భూమికి నేడు (ఫిబ్రవరి 1), రేపు (ఫిబ్రవరి 2) అతి సమీపంగా రానుంది. ఆ సమయంలో 26 -27 మిలియన్ మైళ్ల దూరం (4.2 కోట్ల కిలోమీటర్లు సుమారు) లోకి వస్తుంది. అందుకే ఈ తోక చుక్క స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ భూమి నుంచి చంద్రుడు ఉన్న దానితో పోలిస్తే 100 రెట్ల దూరంలో ఉంటుంది. మంచి బైనాక్యులర్ సాయంతో దీన్ని రాత్రి వేళ చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యరశ్మి, తోక చుక్కలోని కార్బన్ మాలిక్యూల్స్ మధ్య సంఘర్షణ వల్లే ఈ తోకచుక్క గ్రీన్ రంగులో కనిపిస్తుంది. రాయి, ఐస్, దుమ్ముతో ఏర్పడేవే తోకచుక్కలు.


More Telugu News