అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్: నిర్మలా సీతారామన్

  • పార్లమెంటులో నిర్మల ప్రసంగం
  • అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ అని వెల్లడి
  • ప్రస్తుత ఏడాది 7 శాతం వృద్ధిరేటు అంచనా
  • ఈ స్థాయి వృద్ధిరేటు ప్రపంచంలో మనదేనన్న నిర్మల
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభించారు. తొలుత ఆమె ప్రసంగిస్తూ, అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశామని వివరించారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. 

గడచిన తొమ్మిదేళ్లలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని తెలిపారు. తలసరి ఆదాయం రెట్టింపైందని వివరించారు. ప్రస్తుత ఏడాదికి 7 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్థిక సర్వే చెబుతోందని నిర్మలా పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనదే అవుతుందని హర్షం వ్యక్తం చేశారు. 

కరోనా సంక్షోభ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామని, ఇకపైనా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. వంద కోట్ల మందికి 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించామని చెప్పారు. సామాజిక భద్రత, డిజిటల్ చెల్లింపుల విషయంలో చక్కటి అభివృద్ధి సాధించామని అన్నారు. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 

భారత ఆర్థిక వ్యవస్థ సరైన పంథాలో పయనిస్తోందని నిర్మలా సీతారామన్ వివరించారు. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్ ముందుకు అడుగులు వేస్తోందని వెల్లడించారు.


More Telugu News