ఫేక్ ప్రొఫైల్స్ తో ఊబర్ కు కన్నం వేసిన మాజీ ఉద్యోగి

  • 388 నకిలీ డ్రైవర్ల ఖాతాల నమోదు
  • ఊబర్ స్ప్రెడ్ షీట్ లో వీరి పేర్లు చేర్చిన మాజీ ఉద్యోగి
  • దీంతో నకిలీ ఖాతాలకు 1.17 కోట్ల చెల్లింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఊబర్
ఊబర్ లో కేవలం ఐదు నెలల పాటు పనిచేసి వెళ్లిపోయిన ఓ మాజీ ఉద్యోగి సంస్థకు భారీగా కన్నం వేశాడు. ఏకంగా 1.17 కోట్ల మేర మోసం చేశాడు. దీనిపై ఊబర్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. సదరు వ్యక్తి 2021 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కాంట్రాక్టర్ గా పనిచేశాడు. ఊబర్ ప్లాట్ ఫామ్ కింద నమోదైన డ్రైవర్లకు చెల్లింపుల వ్యవహారాలు చూసేవాడు. అలాగే డ్రైవర్ల వివరాలను అప్ డేట్ చేసేవాడు.

తాను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నకిలీ డ్రైవర్ల ఖాతాలను స్ప్రెడ్ షీట్ లో నమోదు చేశాడు. సాధారణంగా ఈ స్ప్రెడ్ షీట్ ఆధారంగానే సంస్థ తన డ్రైవర్లకు చెల్లింపులు చేస్తుంటుంది. ఈ స్ప్రెడ్ షీట్ లో నకిలీ డ్రైవర్ల ఖాతాలను సృష్టించడంతో వారికి కూడా చెల్లింపులు జరిగాయి. ఊబర్ తన పరిశీలన సందర్భంగా 388 నకిలీ ఖాతాలను గుర్తించింది. కాంట్రాక్టర్ గా పనిచేసిన వ్యక్తి కంప్యూటర్ నుంచే ఇందులో 191 నకిలీ ఖాతాలను చేర్చినట్టు తెలిసింది. మొత్తం మీద 388 నకిలీ ఖాతాలకు సంబంధించి 18 బ్యాంకు ఖాతాలకు రూ.1,17,03,033 చెల్లింపులు జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



More Telugu News