ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం

  • ధన్‌బాద్‌లోని 13 అంతస్తుల భవనంలో ఘటన
  • మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మోదీ
  • స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పిన సీఎం హేమంత్ సోరెన్
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు ముఖ్య కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియదన్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.  

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా యంత్రాంగం అత్యవసర ప్రాతిపదికన పనిచేస్తోందని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. 

ధన్‌బాద్ అగ్నిప్రమాదంలో ప్రజలు మరణించడం బాధాకరమని, ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని, గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోందని అన్నారు. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు సీఎం సోరెన్ పేర్కొన్నారు. 

ధన్‌బాద్‌ జోరాఫటక్‌లోని 13 అంతస్తుల ఆశీర్వాద్ టవర్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 40 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 10 మందిని కాపాడినట్టు ధనబాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News