వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే సీఎం రాజధానిపై ప్రకటన చేశారు: సత్యకుమార్

  • విశాఖ ఏపీ రాజధాని కాబోతోందన్న జగన్
  • కోర్టు పరిధిలోని అంశంపై ఎలా ప్రకటన చేస్తారన్న సత్యకుమార్
  • తన ఆఫీసును తరలిస్తున్నట్టు చెప్పడం అభ్యంతరకరమని వెల్లడి
  • వివాదాలు సృష్టించడం సీఎంకు అలవాటేనని విమర్శలు
ఢిల్లీలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో ఏపీ రాజధాని విశాఖపట్నం అంటూ  సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 

విశాఖ రాజధాని కాబోతోందని ఢిల్లీ సదస్సులో ఏపీ సీఎం చెప్పారని, కోర్టు పరిధిలోని అంశంపై ప్రకటన సరికాదని, తన ఆఫీసును తరలిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పడం అభ్యంతరకరమని అన్నారు. దీన్ని బట్టి సీఎంకు రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవంలేదని అర్థమవుతోందని సత్యకుమార్ విమర్శించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జగన్ ఇవాళ రాజధానిపై ప్రకటన చేశారని సత్యకుమార్ ధ్వజమెత్తారు. 

సీఎం ఒక్క పైసా పెట్టుబడి కానీ, పరిశ్రమ కానీ తీసుకురాలేకపోయారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ప్రజాదరణ తగ్గిందని ఇండియాటుడే సర్వేలో తేలిందని వెల్లడించారు. వివేకా హత్యలో కుటుంబ సభ్యుల ప్రమేయంపై వార్తలు వచ్చాయని అన్నారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వివాదాలు సృష్టించడం జగన్ కు అలవాటేనని సత్యకుమార్ విమర్శించారు.


More Telugu News