చంద్రుడిపై చిక్కుకుపోయానంటూ తుంటరి ట్వీట్.. ముంబై పోలీసుల రిప్లై అదుర్స్!

  • అత్యవసర పరిస్థితి తలెత్తితే 100కి ఫోన్ చేయాలని ముంబై పోలీస్ ట్వీట్
  • చంద్రుడిపై ఉన్న వ్యోమగామి ఫొటో పెట్టిన యూజర్
  • తమ పరిధిలోకి రాదంటూ కౌంటర్ ఇచ్చిన పోలీసు శాఖ
నేరగాళ్లను పట్టుకోవడంలోనే కాదు.. తుంటరి ట్వీట్లు చేసే వాళ్లకు కౌంటర్లు ఇవ్వడంలోనూ ముందున్నారు ముంబై పోలీసులు. అత్యవసర సమయంలో ‘డయల్ 100’కు ఫోన్ చేయాలంటూ పెట్టిన ట్వీట్ పై జోక్ చేసిన యూజర్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. దెబ్బకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

‘‘ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే డయల్ 100కి ఫోన్ చేయండి’’ అని ముంబై పోలీసులు ఓ వీడియోను ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన ఓ ట్విట్టర్ యూజర్.. చంద్రుడిపై నిలబడిన ఓ వ్యోమగామి ఫొటో పెట్టి, ‘ఇక్కడ చిక్కుకుపోయా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. అది మా పరిధిలోకి రాదంటూ కౌంటర్ ఇచ్చింది. ‘‘ఇది నిజంగా మా జ్యూరిస్ డిక్షన్ లోకి రాదు.. కానీ చంద్రుడిపై ఉన్న మిమ్మల్ని వెనక్కి తీసుకురాగలమని మమ్మల్ని నమ్మినందుకు సంతోషిస్తున్నాం’’ అంటూ చమత్కరించింది.

బీఎంఎస్ ఖాన్ అనే వ్యక్తి పెట్టిన ట్వీట్ కు ముంబై పోలీస్ ఇచ్చిన రిప్లై బ్రిలియంట్.. ఎపిక్ అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ముంబై పోలీసులు కూడా ఓ మీమ్ పేజ్ ప్రారంభించవచ్చు’ అంటూ ఓ యూజర్ జోక్ చేశాడు.

గతంలో కూడా ఇలానే ట్వీట్లు పెట్టిన వారికి గట్టి కౌంటర్లే ఇచ్చారు ముంబై పోలీసులు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ఇప్పించాలని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. ‘100’ అంటూ బదులివ్వడం వైరల్ అయింది.


More Telugu News