కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రికి మూడు జీవిత ఖైదులు!

  • కేరళలో ఘటన.. కుమార్తెపై పదేపదే అత్యాచారం
  • గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి
  • డీఎన్‌ఏ పరీక్షలో దొరికిపోయిన నిందితుడు
  • మూడు జీవిత ఖైదులతోపాటు రూ. 6.6 లక్షల జరిమానా  
మైనర్ అయిన కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడి, గర్భవతి కావడానికి కారణమైన తండ్రికి కేరళ కోర్టు మూడు జీవిత ఖైదులు విధించింది. మంజేరి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజేశ్.కె ఈ మేరకు తీర్పు చెప్పారు. నిందితుడికి మూడు జీవిత ఖైదులు విధించిన న్యాయస్థానం జీవితాంతం అతడు జైలులోనే ఉండాలని తీర్పు చెప్పినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమసుందరన్ తెలిపారు. అంతేకాదు, దోషికి రూ. 6.6 లక్షల జరిమానా కూడా విధించినట్టు తెలిపారు. 

కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మార్చి 2021లో తొలిసారి 15 ఏళ్ల కుమార్తెపై దోషి అత్యాచారానికి పాల్పడ్డాడు. కరోనా నేపథ్యంలో బాలిక ఇంట్లో ఉండి ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను పడకగదిలోకి లాక్కెళ్లిన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో చంపేస్తానని బెదిరించాడు. గతంలో మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన దోషి.. ఆ ఏడాది అక్టోబరు వరకు కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో అదే ఏడాది నవంబరులో బాలిక తిరిగి స్కూలుకు వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలో కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు సమస్య ఏమీ లేదని చెప్పాడు. జనవరి 2022లో మరోసారి కడుపు నొప్పితో బాధపడడంతో ఈసారి ఆమెను ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చూపించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. 

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాలిక గర్భాన్ని వైద్యులు తొలగించారు. పిండం, బాలిక తండ్రి డీఎన్ఏను అధికారులు సేకరించారు. అనంతరం జరిపిన పరీక్షల్లో బాలిక గర్భవతి కావడానికి తండ్రే కారణమని తేలింది. ఈ కేసు విచారణను వేగంగా జరిపిన కోర్టు ఆధారాలను పరిశీలించిన అనంతరం బాధిత బాలిక తండ్రిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.


More Telugu News