‘హంపి ఉత్సవ్’లో కైలాశ్‌ ఖేర్‌కు చేదు అనుభవం

  • సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదికపైకి వాటర్ బాటిల్ విసిరిన యువకులు
  • కన్నడ పాటలు పాడలేదన్న ఆగ్రహంతో దాడి
  • ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు
ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ కు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలోని హంపీలో ఆయన సంగీత ప్రదర్శన ఇస్తుండగా.. కొందరు యువకులు అతి చేశారు. వేదిపై కైలాశ్ ఖేర్ పాటలు పాడుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకులు ఆయనపై వాటర్‌ బాటిల్‌ విసిరారు. అయితే అది ఆయనకు తాకకున్నా.. దగ్గర్లో పడింది. దీన్ని పట్టించుకోకుండా ఖేర్‌ తన ప్రదర్శన కొనసాగించారు. అధికారులు క్షణాల్లోనే ఆ బాటిల్‌ను స్టేజ్‌పై నుంచి తొలగించారు.

‘హంపి ఉత్సవ్’ గత శుక్రవారం ప్రారంభమైంది. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుక ఆదివారం ముగిసింది. ముగింపు సందర్భంగా కైలాశ్‌ ఖేర్‌ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. అయితే ఆయన పూర్తిగా హిందీ పాటలే పాడారు. కన్నడ పాటలు పాడలేదన్న ఆగ్రహంతో యువకులు బాటిల్ విసిరారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ప్రదీప్, సురా అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశామని చెప్పారు. కార్యక్రమం యథావిధిగానే కొనసాగిందని వివరించారు.

హిందీతోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ కైలాశ్ ఖేర్ ఎన్నో హిట్ పాటలు పాడారు. తెలుగులో పరుగు, మిర్చి, భరత్ అనే నేనుతోపాటు బాహుబలిలో హిందీ, తమిళ్ వర్షన్స్ లో పాడారు. అరుంధతి సినిమాలో ‘కమ్ముకున్న చీకట్లోన..’ అంటూ వచ్చే పాట సూపర్ హిట్.


More Telugu News