మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని బ్లాక్ చేయడంపై వ్యాజ్యాలు.. వచ్చే వారం విచారించనున్న సుప్రీం

  • డాక్యుమెంటరీని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్న 
  •  లాయర్ ఎంఎల్ శర్మ
  • అత్యవసరంగా విచారణ జరపాలని వినతి
  • ఫిబ్రవరి 6వ తేదీన లిస్ట్ చేసిన సుప్రీం
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. వివాదాస్పద డాక్యుమెంటరీని బ్లాక్ చేసేందుకు కేంద్రం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిన్నింటిపై వచ్చే సోమవారం (ఫిబ్రవరి 6న) విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది. 

తాము దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ, సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. వీరి కంటే ముందు జర్నలిస్ట్ ఎన్.రామ్, లాయర్ ప్రశాంత్ భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా పిటిషన్ వేశారు. 

రెండు భాగాల బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించడం దుర్మార్గమని, నిరంకుశం, రాజ్యాంగ విరుద్ధమని ఎంఎల్ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బీబీసీ డాక్యుమెంటరీని అత్యున్నత ధర్మాసనం పరిశీలించాలని, 2002 గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీ లింక్ లను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు ఐటీ రూల్స్ కింద కేంద్రం అత్యవసర అధికారాలను ఉపయోగించింది. కానీ కేంద్రం అధికారికంగా బ్లాకింగ్ ఆర్డర్ ను ప్రచురించలేదు. డాక్యుమెంటరీని ప్రదర్శించారన్న కారణంతో అజ్మీర్ లో కాలేజీ స్టూడెంట్లను తొలగించారు’’ అని లాయర్ సీయూ సింగ్ చెప్పారు. వాదనలు విన్న తర్వాత.. ఈ పిల్స్ ను వచ్చే సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.


More Telugu News