హిండెన్‌బర్గ్‌ నివేదిక బోగస్: అదానీ గ్రూప్

  • నివేదికలో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలన్న సీఎఫ్ఓ
  • నివేదిక వెనుక పెద్ద కుట్ర ఉందని విమర్శ
  • తమ వ్యాపారాల్లో ఎలాంటి తప్పిదం కనుగొనలేదని వెల్లడి
తమ కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌ మరోసారి కొట్టిపారేసింది. ఆ నివేదికలో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలని విమర్శించింది. తమ గ్రూప్ యొక్క ప్రాథమిక వ్యాపారాలను తప్పుగా సూచించడం తప్ప ఎలాంటి అవకతవకలు కనుగొనలేకపోయిందని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) జుగేష్ ఇందర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడిగా చూడకూడదని, దేశీయ సంస్థల స్వాతంత్య్రం, సమగ్రత, విశ్వసనీయత, దేశ అభివృద్ధిపై దురుద్దేశపూర్వక దాడిగా చూడాలన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ ఆదివారమే 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. 

తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్‌బర్గ్‌ షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని విమర్శించింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో జుగేష్ ఇందర్ సింగ్ హిండెన్ బర్గ్ పై విరుచుకుపడ్డారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఎఫ్‌పీఓ) సమయంలో హిండెన్‌బర్గ్‌ ఈ నివేదిక విడుదల చేయడం పెద్ద కుట్ర అన్నారు. 

‘హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎప్పుడో సమాధానం ఇచ్చాయి. వీటిలో 68 ప్రశ్నలు బోగస్, తప్పుడువే. అబద్ధాలు,తప్పుడు సమాచారం ఆధారంగా తయారు చేసిన ఈ బూటకపు నివేదిక కూడా మా వ్యాపారాలలో ఎలాంటి తప్పును కనుగొనలేకపోయింది. అది ఒక తప్పుడు మార్కెట్‌ను సృష్టించడం కోసం నిగూఢ ఉద్దేశ్యంతో నడుస్తున్న సంస్థ’ అని జుగేష్ ఇందర్ సింగ్ ఆరోపించారు.


More Telugu News