రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా.. కేటుగాళ్లు వున్నారు.. జర భద్రం!

  • రీచార్జి చేయించని సిమ్ కార్డులను లాక్ చేస్తున్న టెలికాం కంపెనీలు
  • స్వల్ప మొత్తం చెల్లించి ఆ నంబర్లను కొనుగోలు చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
  • ఆపై ఆ నంబర్లతో మీ బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేస్తున్న వైనం
స్మార్ట్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ సౌకర్యం అందుబాటులోకి రావడం, అప్పట్లో టెలికాం కంపెనీలు ఉచితంగా జీవిత కాల ఇన్ కమింగ్ సదుపాయాన్ని కల్పించడంతో చాలా మంది రెండేసి నెంబర్లు వాడుతున్నారు. ఆఫీసు పనులకు ఓ నెంబర్, కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులతో మాట్లాడేందుకు మరో నెంబర్ ను మెయింటెన్ చేశారు. అయితే, ఇటీవల టెలికాం కంపెనీలు చార్జీల మోత మోగించడం మొదలు పెట్టడంతో పర్మినెంట్ నెంబర్ ఒక్క దానికి మాత్రమే రీచార్జ్ చేయించుకుంటున్నారు. మరో నెంబర్ కు రీచార్జ్ చేయకుండా వదిలేస్తున్నారు. ఇలా చేయడమంటే సైబర్ నేరస్థులకు అవకాశం ఇచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. కొంతకాలం పాటు వాడిన మొబైల్ నెంబర్ ను ఇలా వదిలేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. 

మోసం జరిగేది ఇలా..
రీచార్జ్ చేయకుండా వదిలేసిన నెంబర్ ను టెలికాం కంపెనీలు బ్లాక్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఇలా బ్లాక్ చేసిన నెంబర్లను ఆయా కంపెనీలు అమ్మకానికి పెడతాయి. నిర్ణీత మొత్తం చెల్లించి ఈ నెంబర్ ను ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడే సైబర్ నేరస్థులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఇలాంటి నెంబర్లను సొంతం చేసుకుంటున్నారు. ఆపై ఆయా నెంబర్లకు చెందిన పాత యజమానుల బ్యాంకు లావాదేవీల వివరాలను కూపీ లాగుతున్నారు.

టెక్నాలజీ సాయంతో బ్యాంకు ఖాతా, ఈ మెయిల్ ఐడీని తెలుసుకుని మొబైల్ నెంబర్ తో యూపీఐ యాప్ లలోకి లాగిన్ అవుతున్నారు. ఆపై ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫర్గాట్ యూజర్ ఐడీపై క్లిక్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆపై పాస్ వర్డ్ కూడా మార్చేసి, ఖాతాలోని సొమ్మును కొట్టేస్తారు. ఇదంతా మీ పాత మొబైల్ నెంబర్ వారి చేతుల్లోకి వెళ్లడం వల్లే సాధ్యమవుతుందని నిపుణులు హెచ్చరించారు.


More Telugu News