పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం.. కాలువలో పడ్డ బస్సు.. 39 మంది మృతి

  • ఎగిసిపడిన మంటల్లో ప్రయాణికులు సజీవదహనం
  • ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నారు: అధికారులు
  • గాయాలపాలైన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడి
పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలోని లాస్ బెలాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలువలో పడడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలామంది ప్రయాణికులు సజీవదహనమయ్యారని చెప్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని వివరించారు.

క్వెట్టా నుంచి కరాచీ వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. మూలమలుపులో ఉన్న బ్రిడ్జి వద్ద బస్సు అదుపుతప్పిందని, రెయిలింగ్ ను ఢీకొని కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. గాయాలపాలైన వారిలోనూ కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.


More Telugu News