తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగింది: బాలకృష్ణ

  • హార్ట్ బీట్ ఆగిపోయింది.. కాసేపటికి మళ్లీ మొదలైందన్న హీరో
  • కుప్పం నుంచి తీసుకొచ్చినప్పుడు ఉన్నట్లే తారకరత్న ఆరోగ్య పరిస్థితి
  • ఇంప్రూవ్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించిన బాలకృష్ణ
  • అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం
యువగళం యాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి ముందు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందని బాలకృష్ణ తెలిపారు. తొలుత తారకరత్న హార్ట్ బీట్ ఆగిపోయిందని, కాసేపటి తర్వాత తిరిగి మొదలైందని వివరించారు. 

కుప్పంలో డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారని చెప్పారు. వారి సూచనల మేరకే అత్యాధునిక సదుపాయాలు ఉన్న నారాయణ హృదయాలయకు తారకరత్నను తీసుకొచ్చామని పేర్కొన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలివిడిగా ఉండే తారకరత్న కోసం అందరూ ప్రార్థిస్తున్నారని చెప్పారు. అభిమానుల దీవెనలతో తారకరత్న త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కుప్పం నుంచి తీసుకొచ్చినపుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే నిలకడగా ఉందని బాలకృష్ణ చెప్పారు. వైద్యులు అన్నిరకాలుగా కేర్ తీసుకుంటున్నారని, ఇంప్రూవ్‌మెంట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. అంతర్గత రక్తస్రావం కారణంగా తారకరత్నకు స్టెంట్ వేయడం కుదరలేదని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని బాలకృష్ణ వివరించారు.


More Telugu News