అమెరికా అధ్యక్ష పోరు.. ప్రచారం మొదలుపెట్టిన ట్రంప్

  • ‘మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరుతో జనంలోకి మాజీ అధ్యక్షుడు
  • ఎర్లీ ఓటింగ్ జరిగే రాష్ట్రాలు న్యూ హాంప్ షైర్, సౌత్ కరోలినాలో సభలు
  • అందరమూ కలిసి ప్రపంచ దేశాలలో అమెరికాను గ్రేట్ గా నిలబెడదామని పిలుపు
అమెరికా అధ్యక్ష పదవికి మరోమారు పోటీ చేస్తానని రెండు నెలల కిందటే ప్రకటించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రచారం మొదలు పెట్టారు. ఎర్లీ ఓటింగ్ జరిగే రాష్ట్రాలు న్యూ హాంప్ షైర్, సౌత్ కరోలినాలో శనివారం ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. మరోమారు అధ్యక్షుడిగా సేవలందించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తన కమిట్మెంట్ పై కొంతమంది ప్రజల్లో ఉన్న సందేహాలను ట్రంప్ పటాపంచలు చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా అందరమూ కలిసి అమెరికాను అద్భుతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెడదామని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దడానికి తనతో కలిసి నడవాలని కోరారు. న్యూ హాంప్ షైర్ లో నిర్వహించిన ప్రచారంలో ట్రంప్ తన ఎజెండాను ప్రజలకు వివరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలసీలకు పూర్తి వ్యతిరేకంగా పాలసీలను రూపొందిస్తానని మాటిచ్చారు. వలస విధానానికి సంబంధించిన పాలసీలతో పాటు దేశంలో నేరాల నివారణకు ప్రత్యేకంగా పాలసీలను రూపొందిస్తానని వెల్లడించారు.

మరోవైపు, ప్రైమరీ ఎలక్షన్స్ లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఆయన అనుచరులు నిమగ్నమయ్యారు. సౌత్ కరోలినా రాష్ట్రంలో జరగబోయే ప్రైమరీ ఎలక్షన్స్ లో ట్రంప్ ను అందరికంటే ముందు నిలబెట్టేందుకు క‌ృషి చేస్తున్నారు. కాగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి చెందిన రాన్ డెసాంటిస్, మైక్ పెన్స్, నిక్కీ హాలే తదితరులతో పోటీ పడనున్నారు. ప్రైమరీ ఎలక్షన్స్ లో వారందరినీ వెనక్కి నెట్టి తుదిపోరులో నిలిచేందుకు ట్రంప్ గట్టిగానే ప్రచారం చేయనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.


More Telugu News