ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనన్న మంత్రి
  • బీజేపీ పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వస్తే తామూ సిద్ధమన్న కేటీఆర్
  • నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పర్యాయం మాదిరిగా సీఎం కేసీఆర్ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా  మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వస్తే.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమని ప్రకటించారు. 

ఈ సందర్భంగా కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని, పునర్విభజన చట్టంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఒక్కపైసా అదనంగా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. తాను చెప్పింది తప్పయితే రాజీనామాకు సిద్ధమని బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.  కాగా, వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియట్‌కు కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అదే సమయంలో ఆయన జిల్లాల పర్యటనలు చేస్తుండటం, బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో త్వరలో అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉన్నామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


More Telugu News