డార్క్ చాక్లెట్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?

  • డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
  • వీటితో గుండెతోపాటు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
  • కానీ వీటిల్లో ప్రమాదకరమైన భార లోహాలు
  • ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరిక
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదనే వార్తలు వింటుంటాం. కొందరు చాక్లెట్లు మంచివి కావంటుంటారు. దీంతో ఏది నిజం? అనే అయోమయం ఏర్పడుతుంది. నిజానికి డార్క్ చెక్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ, వీటిని ఎలాంటి హానికారకాలు కలవకుండా చేసినప్పుడేనన్న విషయాన్ని మాత్రం గుర్తించాలి. 

డార్క్ చాక్లెట్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం బలపడుతుందని, రక్తపోటు తగ్గుతుందని, గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. మెదడు ఆరోగ్యంగా పని చేయడానికి, స్ట్రోక్ రిస్క్ తగ్గించడానికి సైతం డార్క్ చాక్లెట్లు మేలు చేస్తాయని కూడా చెప్పాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. ఇవన్నీ నాణేనికి ఒకవైపు. రోజూ ఒక డార్క్ చాక్లెట్ చొప్పున దీర్ఘకాలం పాటు తినడం వల్ల వచ్చే అనర్థాల గురించి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ లో వెల్లడించారు. ‘డార్క్ సైడ్ ఆఫ్ డార్క్ చాక్లెట్’ పేరుతో డాక్టర్ సుధీర్ కుమార్ ప్రజలను చైతన్యపరిచే సమాచారాన్ని పోస్ట్ చేశారు. 

  • డార్క్ చాక్లెట్లు సహజ ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఎంతో ప్రజాదరణకు నోచుకున్నాయి. వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మంచివని, వాటిల్లో చక్కెరలు తక్కువని, క్యాండీలతో పోలిస్తే డార్క్ చాక్లెట్లు ఆరోగ్యకరమైనవి, సురక్షితమైనవని 50 శాతానికి పైగా ప్రజలు భావిస్తున్నారు.
  • ఆరోగ్యకరమని భావించే డార్క్ చాక్లెట్ల వెనుక చీకటి కోణం కూడా ఉంది. కొన్ని డార్క్ చాక్లెట్లలో కాడ్మియం, లెడ్ ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ రెండు భార లోహాలు కారణం. ఎన్నో డార్క్ చాక్లెట్ శాంపిళ్లలో వీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • ఈ భార లోహాలు చాలా స్పల్ప మోతాదులో దీర్ఘకాలం పాటు మన శరీరంలోకి చేరినా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులకు చాలా ప్రమాదకరం. ఇవి మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయి. ఐక్యూని తగ్గిస్తాయి. 
  • అదే పనిగా లెడ్ కు ఎక్స్ పోజ్ అయితే నాడీ వ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయి. రక్తపోటు, వ్యాధి నిరోధక శక్తి బలహీనపడడం, మూత్రపిండాలు దెబ్బతినడం, పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతాయి.
  • డార్క్ చాక్లెట్ బరువులో కొకోవా కనీసం 65 శాతం మేర ఉంటుంది. కొకోవా బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. వీటితోనే మనకు ఆరోగ్యం. కానీ, దురదృష్టవశాత్తు కొకోవా ఘన పదార్థాల్లో భారీ లోహాలు కూడా భాగంగా ఉంటున్నాయి. 
  • కనుక లెడ్, క్యాడ్మియం తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లు తీసుకోవాలి. అప్పుడప్పుడు తినొచ్చు. మిల్క్ చాక్లెట్లు కూడా తినొచ్చు. చిన్నారులు, గర్భిణులు వీటిని తినకుండా ఉండాలి. 


More Telugu News