కమలహాసన్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్.. కాంగ్రెస్ లో విలీనమంటూ ప్రకటన!

  • విలీనం వార్త పూర్తిగా అబద్ధమన్న ఎంఎన్ఎం
  • తమ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని వెల్లడి
  • మెయింటెనెన్స్ కోసమంటూ తాత్కాలికంగా సైట్ మూసివేత
సినీ నటుడు కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వెబ్ సైట్ హ్యాక్ అయింది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కమలహాసన్ పాల్గొనడం, ఈరోడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించడంతో.. విలీనం నిజమేనని రాజకీయవర్గాలు భావించాయి. కానీ దీనిపై ఎంఎన్ఎం వివరణ ఇచ్చింది. 

కాంగ్రెస్‌ పార్టీలో ఎంఎన్ఎం విలీనం అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పింది. ‘‘విలీనం (కాంగ్రెస్‌తో) వార్త పూర్తిగా అబద్ధం. అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. కాకపోతే ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మాత్రం మద్దతిస్తున్నాం. దీనిపై మా నేత కమలహాసన్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారు'' అని మీడియాకు ఎంఎన్ఎం ప్రతినిధి మురళి అబ్బాస్ చెప్పారు.

శుక్రవారం ఉదయం ఎంఎన్ఎం అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన వచ్చింది. ‘‘2024 లోక్ సభ ఎన్నికలకు మక్కల్ నీది మయ్యం నుంచి పెద్ద ప్రకటన. జనవరి 30న అధికారికంగా విలీనం జరుగుతుంది’’ అని అందులో పేర్కొన్నారు. వెంటనే గుర్తించిన ఎంఎన్ఎం నేతలు మెయింటెనెన్స్ కోసమంటూ వెబ్ సైట్ ను తాత్కాలికంగా మూసేశారు.

2018లో ఎంఎన్ఎంను కమలహాసన్ ప్రారంభించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు, గ్రామీణ సాధికారత తీసుకొచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎన్ఎం ఒక్క సీటు కూడా సాధించలేదు.


More Telugu News