భారత్–చైనా సైనికుల మధ్య మరిన్ని ఘర్షణలకు అవకాశం!

  • ఎల్ఏసీ వద్ద రెచ్చిపోతున్న డ్రాగన్ సైన్యం
  • లడఖ్ వద్ద కొత్త సైనిక స్థావరాల ఏర్పాటు 
  • మరిన్ని ఘర్షణలు జరుగుతాయని అంతర్జాతీయ వార్తా సంస్థ  కథనం
భారత్–చైనా మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా మరింత రెచ్చిపోతోంది. ఆ దేశ సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా లడఖ్ వద్ద తమ సైనిక, మౌలిక సదుపాయాలను క్రమంగా పెంచుకుంటోంది. 

ఇలా సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భారత్, చైనా సైనికుల మధ్య మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భారత్ భావిస్తోందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో లడఖ్ పోలీసుల కొత్త, రహస్య పరిశోధనా పత్రంలో ఈ విషయాలు వెల్లడించారని తెలిపింది. 

ఈ నెల 20-22 తేదీల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) నిర్వహించిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు సేకరించిన సమాచారం, సంవత్సరాల తరబడి భారత్-చైనా సైనిక ఉద్రిక్తతల నమూనా ఆధారంగా లడఖ్‌లో రెండు దేశాల మధ్య మరిన్ని వాగ్వివాదాలు జరుగుతాయని రాయిటర్స్ నివేదించింది.  2020లో లడఖ్‌లో భారత, చైనా దళాలు ఘర్షణ పడినప్పుడు  24 మంది సైనికులు మరణించారు. ఆ తర్వాత రెండు దేశాల సైనిక, దౌత్య చర్చల తర్వాత ఉద్రిక్తతలు సడలాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో గత డిసెంబర్‌లో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చెలరేగినా మరణాలు సంభవించలేదు.


More Telugu News