చంద్రబాబులా కాదు... కార్యకర్తల జోలికి వస్తే లోకేశ్ తాట తీస్తాడు: అచ్చెన్నాయుడు

  • నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం
  • కుప్పంలో భారీ బహిరంగ సభ
  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాల్లో గెలుస్తుందన్న అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని ధీమా
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కుప్పంలో టీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారని, కానీ జగన్ మోహన్ రెడ్డి పిచ్చి ముఖ్యమంత్రిని, సైకో ముఖ్యమంత్రిని భరించాల్సి రావడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. 

మూడున్నర సంవత్సరాలుగా ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ మూర్ఖుడు ఎప్పుడు మనమీద పడతాడోనని ఈ మూడున్నరేళ్లుగా నిద్రలేకుండా గడిపామని, ఇప్పుడీ మూర్ఖుడికి సరైన మొగుడు, మన యువ నాయకుడు లోకేశ్ వచ్చారని స్పష్టం చేశారు. లోకేశ్ వారసత్వంతో రావడంలేదని, రాష్ట్ర భవిష్యత్ ను తిరగరాయాలని నాయకుడిగా వస్తున్నాడని ఉద్ఘాటించారు. 

గతంలో లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశారని, రాష్ట్రంలో సీఎం జగన్ నియోజకవర్గం సహా 175 నియోజకవర్గాల్లో 20 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు, తారు రోడ్లు వేశారంటే అందుకు లోకేశ్ కారణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాత్రుళ్లు వీధి లైట్లుగా ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయంటే అందుకు కారణం లోకేశ్ అని అన్నారు. ఏపీ ప్రజలు గుక్కెడు నీళ్లు తాగుతున్నారంటే లోకేశ్ పంచాయతీ శాఖ మంత్రిగా అందించిన సమర్థ పాలన వల్లేనని స్పష్టం చేశారు. 

అలాంటి లోకేశ్ కు అవినీతి అంటించేందుకు జగన్ ప్రయత్నించాడని, తాను అవినీతికి పాల్పడినట్టు భావిస్తే నిరూపించుకో అని సవాల్ విసిరిన నాయకుడు లోకేశ్ అని అచ్చెన్న కొనియాడారు. జగన్ ఆ విధంగా సవాల్ చేయగలడా? అని ప్రశ్నించారు. సైకో జగన్ ఒకవైపు, ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు పోరాడుతున్నారని వెల్లడించారు. 

175 స్థానాల్లో గెలుస్తానని జగన్ చెబుతున్నాడని, చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన కుప్పంలో చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నాడని మండిపడ్డారు. కుప్పం ప్రజలేమీ అమాయకులు కాదని, జగన్ కు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాలతో విజయం సాధించడం ఖాయమని, మళ్లీ చంద్రబాబు సీఎం కావడం తథ్యమని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుతిమెత్తగా చురకలు అంటించి, లోకేశ్ పై పొగడ్తల జల్లు కురిపించారు. "చంద్రబాబు చాలా మంచివారు. అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెబుతారు. అధికారంలోకి వస్తేనేమో కార్యకర్తలను వదిలేసి అధికారులపై పడతారు. మనందరినీ ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయం చెబితే చంద్రబాబు బాధపడినా సరే నేను ఏమీ అనుకోను. కానీ మన లోకేశ్... చంద్రబాబు లాంటి వాడు కాదు. ఈ మూడున్నరేళ్లుగా టీడీపీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసినవాళ్లను లోకేశ్ తాటతీస్తాడు... కార్యకర్తలకు న్యాయం చేస్తాడు" అంటూ ప్రసంగించారు. 

అంతేకాదు, పోలీసుల గురించి మాట్లాడుతూ రాయడానికి వీల్లేని భాషలో అచ్చెన్న ఓ బూతు ప్రయోగం చేశారు. లోకేశ్ పాదయాత్ర కోసం జనం తండోపతండాలుగా వస్తే ఒక్క పోలీసోడు కూడా సహకరించలేదని ఆరోపించారు. తమ పార్టీ యాత్రకు తామే పోలీసులమని, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, యువగళంతో టీడీపీ దళం, స్వరం మారుతోందని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎవరు ఇబ్బందిపెట్టినా ప్రజల కోసం ఓర్చుకోవాలని లోకేశ్ ను కోరుతున్నానని తెలిపారు. ప్రజల సమస్యలు వింటూ, ప్రజల్లోంచి వచ్చే సూచనలు పాటించాలని లోకేశ్ కు సూచిస్తున్నానని పయ్యావుల వివరించారు. తాతయ్య తెగువ, నాన్న నాయకత్వంలో లోకేశ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.


More Telugu News