అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుండగా.. రిక్రూటర్ జాబ్ తీసేసిన గూగుల్!

  • ఇటీవల 12 వేల మందిపై వేటు వేసిన గూగుల్
  • ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగింపు
  • ఇంటర్వ్యూ చేస్తుండగా కాల్ మధ్యలో డిస్ కనెక్ట్ అయిందన్న డాన్ లానిగన్ ర్యాన్
  • సాంకేతిక సమస్య అనుకున్నానని, కానీ తనను తీసేశారని తర్వాత తెలిసిందని వెల్లడి
గూగుల్.. టెక్ దిగ్గజం. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి. ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. కానీ ముందస్తు సమాచారం ఇవ్వలేదు. డ్యూటీ మధ్యలో ఉన్న వాళ్లను కూడా అప్పటికప్పుడు తీసేసింది. అవమానకర రీతిలో సాగనంపింది. అలా ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరి పరిస్థితి మరీ ఘోరం. ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా రిక్రూటర్ ఉద్యోగం ఊడింది. ఈ విషయాన్ని బాధితుడు డాన్ లానిగన్ ర్యాన్ వెల్లడించాడు.

గూగుల్ లో రిక్రూటర్ గా ర్యాన్ పని చేసేవాడు. ఇటీవల ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా కాల్ మధ్యలో డిస్ కనెక్ట్ అయింది. ఎందుకో అర్థం కాక.. కంపెనీ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఇలా తన టీమ్ లోని మరికొందరు కూడా లాగిన్ కాలేకపోయారట. ఏదో సాంకేతిక సమస్య అయి ఉంటుందని వాళ్ల మేనేజర్ చెప్పాడు. సంస్థ నుంచి ఈ మెయిల్ వచ్చాక అసలు విషయం అర్థమైంది. తనను జాబ్ లో నుంచి తీసేశారని తెలిసింది.

‘‘కంపెనీ వెబ్ సైట్ యాక్సెస్ కోల్పోయినప్పుడే.. నా ఈమెయిల్ ను కూడా బ్లాక్ చేశారు. క్యాండిడేట్ తో జరుగుతున్న ఇంటర్వ్యూ కాల్ ను కూడా ఆపేశారు. తర్వాత 15 నుంచి 20 నిమిషాలకు న్యూస్ లో ఓ ప్రకటన వచ్చింది. గూగుల్ లో 12 వేల మందిని తొలగించారని ఆ ప్రకటన సారాంశం’’ అని ర్యాన్ వాపోయాడు.

లింక్డ్ ఇన్ లోనూ ర్యాన్ ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘గూగుల్ నా డ్రీమ్ కంపెనీ. ఏడాది కిందట జాబ్ వచ్చింది. కానీ నా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. గూగుల్ లేఆఫ్ ప్రభావం నాపైనా పడింది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు’’ అని రాసుకొచ్చాడు. 

ఇటీవల ఏకంగా 12 వేల మందిని గూగుల్ తొలగించింది. లే ఆఫ్స్ విషయంలో మొత్తం బాధ్యత తానే తీసుకుంటానని కంపెనీ సీఈవో సుందర్ పిచయ్ చెప్పారు. జాబ్ పోగొట్టుకున్నవాళ్లందరికీ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.


More Telugu News