ఆవు పేడ ఇంధనంతో మారుతి సుజుకి కార్లు

  • వాతావరణంలో పెరిగిపోతున్న కర్బన ఉద్గారాల స్థాయి
  • పర్యావరణం పట్ల క్రమంగా పెరుగుతున్న చైతన్యం
  • గ్రీన్ బాటపడుతున్న ఆటోమొబైల్ సంస్థలు
  • ఆవుపేడతో బయోగ్యాస్
  • తమ సీఎన్జీ మోడళ్లలో బయోగ్యాస్ వాడతామన్న మారుతి
వాతావరణ కాలుష్యం మితిమీరిన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతాంశంగా మారింది. అందుకే ఆటోమొబైల్ కంపెనీలు, టెక్ కంపెనీలు గ్రీన్ బాట పడుతున్నాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించింది. 

కాలుష్యానికి చోటివ్వని రీతిలో ఆవు పేడను ఇంధనంగా ఉపయోగించాలని మారుతి భావిస్తోంది. 2030 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న మారుతి, అదే క్రమంలో ఆవు పేడ నుంచి తయారుచేసిన ఇంధనాన్ని తన వాహనాల్లో వినియోగించనుంది. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ స్థాయులను తగ్గించే క్రమంలో, ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ ఇంధనం భవిష్యత్ లో గొప్ప మార్పు అవుతుందని మారుతి ఆశిస్తోంది. 

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశువుల వ్యర్థాలు ఎక్కువగా లభ్యమవుతాయని, దాంతో భారీ ఎత్తున బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని మారుతి సుజుకి పేర్కొంది. ఈ బయో ఇంధనాన్ని తమ సీఎన్జీ మోడళ్లలో వినియోగిస్తామని వెల్లడించింది. భారత్ లో ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న సీఎన్జీ కార్లలో 70 శాతం మారుతి సుజుకి సంస్థకు చెందినవే. కాగా, ఆవుపేడ ఇంధనం కాన్సెప్టును మారుతి సుజుకి భారత్ లోనే కాకుండా, ఆఫ్రికా దేశాలు, జపాన్ తదితర ఆసియా దేశాల్లోనూ వినియోగించనుంది. 

ఈ ఇంధన ప్రత్యామ్నాయం దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని మారుతి వర్గాలు తెలిపాయి. ఈ బయో ఇంధనం ఉత్పాదన నేపథ్యంలో నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు, బనాస్ డెయిరీ సంస్థతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించాయి. జపాన్ లో ఆవుపేడ నుంచి ఇంధనం తయారుచేసే ఫ్యుజిసాన్ అస్గిరి బయోమాస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టినట్టు మారుతి సుజుకి వివరించింది.


More Telugu News