పఠాన్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ‘రివ్యూ’

  • పఠాన్ సినిమా నాలుగు అపోహలను చెరిపేసిందన్న వర్మ
  • ఓటీటీ కాలంలో సినిమా కలెక్షన్లు గొప్పగా ఉండవన్నది ఒక అపోహ అన్న ఆర్జీవీ 
  • షారూక్ ఆదరణ తగ్గుతోందన్న అపోహలను ఇది తొలగించిందంటూ ట్వీట్
తాజాగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న షారూక్ ఖాన్ 'పఠాన్' సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. స్వభావ రీత్యా మిగతావారికి భిన్నంగా ఆలోచించడం, మాట్లాడడం అలవాటున్న వర్మ ఇప్పుడు పఠాన్ సినిమాపైనా అదే రీతిలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సినిమా నాలుగు అపోహలను పటాపంచలు చేసినట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో వర్మ తన అభిప్రాయాలను షేర్ చేశారు.

‘‘1. ఓటీటీ కాలంలో కలెక్షన్లు గొప్పగా ఉండవు. 2. ఎస్ఆర్కే (షారూక్ ఖాన్) ఫేడింగ్ (ఆదరణ కోల్పోతున్న) స్టార్.  3. దక్షిణాది మసాలా దర్శకుల మాదిరి బాలీవుడ్ దర్శకులు కమర్షియల్ బ్లాక్ బస్టర్ తీయలేరు. 4. కేజీఎఫ్ మొదటి రోజు కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈ అపోహలన్నీ పఠాన్ ద్వారా పటాపంచలయ్యాయి’’ అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. 

పఠాన్ ఈ నెల 25న విడుదల కాగా, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100-110 కోట్ల వరకు వసూలు చేసి ఉంటుందని అంచనా. కానీ కేజీఎఫ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఇందులో సగమే. సినిమాకు వచ్చిన స్పందన పట్ల షారూక్ ఖాన్ ఎంతో సంతోషంతో ఉన్నట్టు, సినిమా బృందం అంచనాలను వసూళ్లు మించాయని తెలుస్తోంది.


More Telugu News