ఆస్తులు కాదు.. ఆహ్లాదకర వాతావరణాన్ని ఇవ్వాలి: తలసాని

  • పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న మంత్రి 
  • మొక్కలను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమవుతామని వ్యాఖ్య 
  • హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని ప్రశంస 
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని... ఆహ్లాదకరమైన వాతావరణమని తెలిపారు. మొక్కలను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు చేసిన వాళ్లమవుతామని చెప్పారు. 

హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని... ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోందని చెప్పారు. గ్రాండ్ నర్సరీని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రశంసించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో లభించే రకరకాల మొక్కలను ఒకే చోట లభించేలా గ్రాండ్ నర్సరీని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని చెప్పారు.


More Telugu News