వాస్తవాన్ని అంగీకరించాల్సిందే.. కిశోర్ బియానీ నిర్వేదం.. ఎగసి పడిన రిటైల్ కెరటం!

  • ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార నిపుణుడికి రాజీనామా పత్రం
  • నిజాన్ని ఒప్పుకుని ముందుకు సాగిపోవాలన్న వ్యాపారవేత్త
  • ఏ సహకారం అవసరమైనా అందుబాటులో ఉంటానని ప్రకటన
కిశోర్ బియానీ అంటే అందరూ గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ, బిగ్ బజార్ పేరు చెబితే చాలా మంది తెలుసని తలూపుతారు. బిగ్ బజార్ పేరుతో పట్టణాల్లో బడా షాపింగ్ మాల్స్ పెట్టి, ప్రత్యేక దినాల్లో భారీ డిస్కౌంట్ అమ్మకాలతో రిటైల్ రంగంలో ఓ సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కిశోర్ బియానీ. 

1987లో మంజ్ వేర్ ప్రైవేటు లిమిటెడ్ ను స్థాపించిన బియానీ, పాంటలూన్ బ్రాండ్ ను సైతం ఆవిష్కరించారు. 1991లో పాంటలూన్ ఫ్యాషన్స్ లిమిటెడ్ గా కంపెనీ పేరు మార్చారు. 1992లో ఐపీవో పూర్తి చేసుకున్న అనంతరం 2001లో హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరులో 22 బిగ్ బజార్ స్టోర్లు తెరిచారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. డిస్కౌంట్ అమ్మకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వినియోగదారులు బిగ్ బజార్ స్టోర్లకు పోటెత్తారు. భారీ ఆదాయాలు కళ్లజూసిన బియానీ, మన వ్యాపారానికి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది.. మన ప్రణాళికకు తిరుగులేదు అని అనుకున్నారు.

స్టోర్లలో అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయం అండగా భారీగా రుణాలు తీసుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బిగ్ బజార్, ఫ్యాషన్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్, ఈజీడే, ఫ్యూచర్ లైఫ్ స్టయిల్, హోమ్ టౌన్ ఇలా గొలుసుకట్టు రిటైల్ మాల్స్ ఏర్పాటు చేసుకుంటూ సాగిపోయారు. ఇదంతా అప్పులతో చేసిన విస్తరణ. చివరికి నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రిటైల్ మాల్స్ ను కూడా బియానీ సొంతం చేసుకున్నారు. 

పాత అప్పులను కొత్త అప్పులతో తీరుస్తూ, వ్యాపార విస్తరణ చేసుకుంటూ వెళ్లారు. రిటైల్ రంగానికి ఐకాన్ గా కిశోర్ బియానీని చెబుతారు. కానీ, 2018లో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూపు కుప్పకూలిపోవడం.. చాలా వ్యాపారాలను దెబ్బతీసింది. మార్కెట్లో అప్పులు లభించడం కష్టంగా మారింది. తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ కూడా సంక్షోభంలో పడిపోవడం, 2020లో కరోనా మహమ్మారి పడగ విప్పి, రిటైల్ దుకాణాలను మూసివేయించడం ఫ్యూచర్ రిటైల్ కు మరణశాసనం లిఖించాయి. ఫ్యూచర్ గ్రూపు అప్పులు రూ.24వేల కోట్లకు పెరిగిపోవడంతో చివరికి ఆయన రిలయన్స్ రిటైల్ కు ఆస్తులు అమ్మి, గట్టెక్కాలని చూశారు. ఫ్యూచర్ రిటైల్ లో వాటాలున్న అమెజాన్ అడ్డం తిరగడంతో ఇది సాధ్యం  కాలేదు. చివరికి దివాలా పరిష్కారం కిందకు ఫ్యూచర్ కేసు వెళ్లింది.

‘వాస్తవాన్ని అంగీకరించాల్సిందే’ కిశోర్ బియానీ తాజాగా చేసిన ప్రకటన ఇది. ఫ్యూచర్ రిటైల్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేస్తూ అన్న మాటలు. ‘‘ఫ్యూచర్ రిటైల్ అనేది ఎప్పుడూ కూడా నా అభిరుచి. దీని వృద్ధికి నా వంతు పాటు పడాను. నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాల్సిందే’’ అని బియానీ తన రాజీనామా పత్రాన్ని ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార నిపుణుడికి పంపించారు. రాజీనామా చేసినా, అవసరమైతే ఏ సమస్య పరిష్కారానికి అయినా సహకారం అంచేందుకు సిద్దంగా ఉంటానని ప్రకటించారు.


More Telugu News