రూ.లక్షల కోట్లకు వారసుడు.. ఆరోగ్యం మాత్రం అతడి చేతుల్లో లేదు!

  • ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి స్థూలకాయం సమస్య
  • ఆస్థమా సమస్యకు స్టెరాయిడ్స్ తీసుకోవడం కారణంగా ఒబెసిటీ
  • కష్టపడి బరువు తగ్గినా.. మళ్లీ అధిక బరువు సమస్య
రిలయన్స్ సామ్రాజ్యానికి ముగ్గురు వారసుల్లో అనంత్ అంబానీ ఒకరు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ నెట్ వర్త్ సుమారు రూ.7.20 లక్షల కోట్లు. ఈ సంపదకు ముకేశ్ కుమార్తె ఇషా, పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీయే వారసులు. ఇప్పటికే ఇషా, ఆకాశ్ వివాహాలు పూర్తి కాగా, త్వరలోనే అనంత్ అంబానీ పెళ్లి కూడా జరగనుంది. రాధికా మర్చంట్ ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవలే వీరి వివాహ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి. 

అనంత్ ను గమనిస్తే భారీ కాయంతో కనిపిస్తున్నాడు. రూ.లక్షల కోట్ల సంపదకు వారసుడు అయిన అనంత్ అంబానీని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అతడు అంత బరువు పెరగడానికి అవే కారణం. దీన్ని అతడి తల్లి నీతా అంబానీ ఓ వార్తా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా పంచుకున్నారు. అనంత్ కు తీవ్రమైన ఆస్థమా సమస్య ఉండేదని ఆమె చెప్పారు. దాంతో అతడికి స్టెరాయిడ్స్ (ఔషధాలు) ఇవ్వాల్సి వచ్చిందట. స్టెరాయిడ్స్ ట్రీట్ మెంట్ తో అనంత్ అంబానీ బరువు పెరిగిపోయినట్టు నీతా వెల్లడించారు. అనంత్ అంబానీ బరువు 200 కిలోల పైమాటే. 

ఆస్థమా (ఉబ్బసం) సమస్య తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు మరో మార్గం లేనప్పుడు స్టెరాయిడ్స్ ను సూచిస్తారు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా, శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. పైగా ఆస్థమా సమస్య ఉన్న వారు వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది. దీనికితోడు స్టెరాయిడ్స్ కారణంగా ఆకలి పెరుగుతుంది. అది బరువు పెరిగేందుకు దారితీస్తుంది. 

సంపన్నుడు కావడంతో అనంత్ అంబానీ 2016లో బరువు తగ్గే చికిత్సకు వెళ్లారు. 18 నెలల కాలంలో అతడు ఏకంగా 108 కిలోల బరువు తగ్గి 100 కిలోలకు వచ్చేశాడు. స్వయంగా నీతా అంబానీయే అనంత్ ను వెంట పెట్టుకుని లాస్ ఏంజెలెస్ లోని చిల్డ్రన్స్ ఒబెసిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అవన్నీ ఫలించి బరువు తగ్గాడు. కానీ, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏమైందో కానీ, అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరిగి, పూర్వపు ఆకారానికి వచ్చేశాడు. వ్యాయామాలు మానడం వల్లా? లేక ఆహార నియమాలు పాటించకపోవడం వల్లా? లేక జీవక్రియల్లో సమస్యలా? అన్నది తెలియదు. డబ్బుంటే ఆరోగ్యం రాదని ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఆరోగ్యం అన్నింటికంటే ప్రధానం అని గుర్తు చేస్తోంది.


More Telugu News