వన్డేల్లో వరల్డ్ నం.1 బౌలర్ గా సిరాజ్.. కోహ్లీ గురించి తను గతంలో చెప్పిన వీడియో వైరల్

  • రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాదీ సిరాజ్
  • 2019లో భారత జట్టుకు దూరం.. రీఎంట్రీలో మెరుపులు
  • కష్టకాలంలో విరాట్ అండగా నిలిచాడన్న సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో సిరాజ్‌ మొత్తం 729 పాయింట్లతో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్‌, న్యూజిలాండ్ స్టార్ ట్రెంట్‌ బౌల్ట్‌ను వెనక్కునెట్టి టాప్ ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు. బౌలర్ల జాబితాలో సిరాజ్ తర్వాత టీమిండియా నుంచి అత్యధికంగా పేసర్‌ మహ్మద్ షమీ 32వ ర్యాంక్ లో నిలిచాడు. గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్ ఈ ఏడాదీ అదే జోరును కొనసాగిస్తున్నాడు. శ్రీలంక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ల్లో 14 వికెట్లతో సత్తా చాటడంతో అతను అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. 

పేలవ ప్రదర్శన కారణంగా 2019లో భారత జట్టుకు దూరమైన సిరాజ్ 2021లో పునరాగమనం చేశాడు. రీఎంట్రీలో అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఏకంగా ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా మారాడు. అయితే, తాను ఈ స్థానంలో ఉండటానికి విరాట్ కోహ్లీనే కారణం అంటూ గతంలో సిరాజ్ చెప్పిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన సిరాజ్ ను తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. కానీ, కొన్నాళ్లకు అతని ఆట గాడి తప్పింది. గత సీజన్లలో పేలవంగా ఆడినప్పటికీ తనపై నమ్మకం ఉంచిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ యాజమాన్యం తనను రిటైన్ చేసుకునేలా ఒప్పించాడని సిరాజ్ చెప్పాడు.


More Telugu News