నాటు నాటు పాట నేపథ్యాన్ని వెల్లడించిన చంద్రబోస్

  • పాటలో ఉన్నదంతా తన ఊరు, చిన్న నాటి జీవితమేనన్న చంద్రబోస్
  • అభిప్రాయాలు, జ్ఞాపకాలను పాటగా మలిచానని వెల్లడి
  • ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన తనకు ఇదొక గొప్ప విజయంగా అభివర్ణన 
‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందడంపై రచయిత చంద్రబోస్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఈ పాటను రాసిచ్చిన చంద్రబోస్.. దీనికి గల నేపథ్యాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ పాట రాయడానికి తాను ఎంతో సమయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘పాటలో నేను రాసినదంతా కూడా నా ఊరు, నా చిన్ననాటి జీవితం, కుటుంబ నేపథ్యం గురించే. నా అభిప్రాయాలు, జ్ఞాపకాలను పదాలుగా మలిచి పాటలో పెట్టానంతే’’ అని చంద్రబోస్ వివరించారు. 

‘‘ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక కావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. కీరవాణి సర్, రాజమౌళి సర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓ చిన్న గ్రామం, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి నిజంగా ఇదొక గొప్ప విజయం. నమ్మలేకుండా, అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ పరిశీలనలో 15 పాటలు ఉంటే అందులో నాటు నాటు కూడా ఒకటి. అవతార్, నాటు నాటు మధ్య పోటీ ఉంటుందని అనుకున్నా. కానీ టాప్-5లో అవతార్ లేకుండా నాటు నాటు స్థానం సంపాదించింది’’ అని చంద్రబోస్ చెప్పారు. 



More Telugu News