సిరీస్ గెలిచినా తగ్గేదే లే అన్న ఓపెనర్లు... మరోసారి భారీ స్కోరు దిశగా టీమిండియా

  • ఇండోర్ లో బాదుడే బాదుడు
  • రోహిత్, గిల్ పోటాపోటీగా బౌండరీల వర్షం
  • సెంచరీ సాధించి అవుటైన రోహిత్
  • భారత్ తరఫున కివీస్ పై రికార్డుస్థాయి భాగస్వామ్యం
జరుగుతున్నది నామమాత్రపు వన్డేనే అయినా... టీమిండియా ఓపెనర్ల దూకుడుకు న్యూజిలాండ్ బౌలర్లు విలవిల్లాడుతున్నారు. ఇండోర్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ శివమెత్తి ఆడారు. పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు బాదుతూ హోల్కర్ స్టేడియాన్ని హోరెత్తించారు. గిల్, రోహిత్ వెంటవెంటనే సెంచరీ సాధించడం విశేషం. 

ముందుగా రోహిత్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. రోహిత్ శర్మకు వన్డేల్లో ఇది 30వ సెంచరీ. అంతేకాదు, మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వన్డేల్లో రోహిత్ సాధించిన సెంచరీ ఇది. 

ఇక సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ కూడా మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గిల్ 72 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతడి స్కోరులో 13 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 

ఇద్దరూ బాదుడుకే ప్రాధాన్యం ఇవ్వడంతో టీమిండియా 25 ఓవర్లకే 205 పరుగులు చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ పై భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది. 2009లో సెహ్వాగ్, గంభీర్ కివీస్ పై నమోదు చేసిన 201 పరుగుల ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ రికార్డు తెరమరుగైంది. ఇక, సెంచరీ సాధించిన అనంతరం 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. 

ప్రస్తుతం భారత్ స్కోరు 27 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 222 పరుగులు. గిల్ 105 పరుగులతోనూ, కోహ్లీ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.


More Telugu News