నాపై అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా.. ఎంపీ అవినాశ్ రెడ్డి

  • వివేకా హత్యకేసులో నిజాలు వెల్లడి కావాలన్న ఎంపీ
  • ఈ కేసులో న్యాయం గెలవాలని కోరుకోవాలని విజ్ఞప్తి 
  • కోర్టులో ట్రయల్ కూడా మొదలు కాలేదని వ్యాఖ్య 
  • మీడియా మాత్రం తీర్పిచ్చేసిందని ఎంపీ ఆవేదన
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న అభియోగాలను ఇప్పటికీ జీర్జించుకోలేక పోతున్నానని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చెప్పారు. తనేంటో, తన వ్యక్తిత్వమేంటో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలి, న్యాయం గెలవాలని కోరుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని, తప్పుడు ఆరోపణలు చేసేముందు మరోసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియాలో ఒక వర్గం తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

కోర్టులో ఈ కేసు ట్రయల్ ఇంకా మొదలు కాకున్నా.. మీడియా మాత్రం తనే దోషినని తీర్పిచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల ఇంట్లో వాళ్లు, బంధువులు ఎలా ఫీలవుతారో ఒక్కసారి ఆలోచించాలని అవినాశ్ రెడ్డి కోరారు. మీ కుటుంబాలలో ఇలాగే జరిగితే అప్పుడు ఆ బాధేమిటనేది తెలిసొస్తుందని అన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు అందుకోవడంపై మంగళవారం ఎంపీ అవినాశ్ స్పందించారు. ఒక్కరోజు ముందు నోటీసులు పంపి, హైదరాబాద్ లో విచారణకు రమ్మంటే ఎలా కుదురుతుందని ఎంపీ ప్రశ్నించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉండడంతో విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. విచారణకు సహకరిస్తానని, అధికారుల ప్రశ్నలకు, సందేహాలకు తనకు తెలిసిన జవాబులు చెబుతానని ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.


More Telugu News