అరుంధతిది ఎస్సీ సామాజికవర్గం.. ఏ కులం వారైనా అరుంధతి నక్షత్రాన్ని చూడాల్సిందే: జగ్గారెడ్డి

  • కలియుగంలోనే కులాలు, మతాల మధ్య పంచాయతీ ప్రారంభమయిందన్న జగ్గారెడ్డి
  • రాముడు, అల్లా మధ్య ఎలాంటి పంచాయతీ లేదని వ్యాఖ్య
  • అంటరానితనాన్ని నిర్మూలించడానికి చదువు ఒక్కటే మార్గం అని సూచన
కలియుగం ప్రారంభమైన తర్వాతే కులాలు, మతాల మధ్య పంచాయతీ ప్రారంభమయిందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అరుంధతి ఎస్సీ సామాజికవర్గానికి చెందినదని... రెడ్డి అయినా, బ్రాహ్మణుడు అయినా, మరే సామాజికవర్గానికి చెందిన వారైనా అరుంధతి నక్షత్రాన్ని చూడాల్సిందేనని చెప్పారు. 

హనుమంతుడికి ఉన్న బలం గురించి చెప్పిన జాంబవంతుడు కూడా ఎస్సీ సామాజికవర్గమేనని అన్నారు. అలాంటి జాంబవంతుడి కుమార్తె శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని చెప్పారు. రాముడు, అల్లా మధ్య ఎలాంటి పంచాయతీ లేదని వారు కొట్టుకున్నట్టు మీరెప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అంటరానితనాన్ని నిర్మూలించాలంటే విద్య ఒక్కటే మార్గమని జగ్గారెడ్డి అన్నారు. అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని... ప్రజల బాధలు, కష్టాలు, అవమానాలను చూసి అంబేద్కర్ చదువుకుని, ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పారు.


More Telugu News