హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహయజమానిగా విజయ్ దేవరకొండ

  • ప్రైమ్ వాలీబాల్ లీగ్ లోకి ఎంటరైన విజయ్ దేవరకొండ
  • హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ లో భాగస్వామ్యం
  • ఫిబ్రవరిలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ప్రారంభం
  • హైదరాబాద్ జట్టును మరింత ముందుకు తీసుకెళతామన్న విజయ్
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఓ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా మారాడు. దేశంలో నిర్వహిస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీల్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ కు విజయ్ దేవరకొండ ఇప్పుడు సహయజమాని అయ్యాడు. 

ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్ ఫిబ్రవరి 4న ప్రారంభం కానుంది. ఈ వాలీబాల్ లీగ్ లోని అగ్రశ్రేణి జట్లలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కూడా ఒకటి. తన నూతన ఒప్పందంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, దీన్ని తాను కేవలం స్పోర్ట్స్ టీమ్ అనుకోవడంలేదని, అంతకుమించినదని, తెలుగు వారసత్వాన్ని ఘనంగా ప్రదర్శించాలనుకుంటున్నామని తెలిపారు. 

తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు తెలుగు స్ఫూర్తి, సత్తాకు ప్రతీకలా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ లోనే కాకుండా, వెలుపల కూడా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కు గుర్తింపు లభించేలా కృషి చేస్తానని విజయ్ దేవరకొండ వివరించారు.

కాగా, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు అభిషేక్ రెడ్డి కనకాల యజమాని. విజయ్ దేవరకొండతో భాగస్వామ్యం పట్ల అభిషేక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు సహయజమానిగానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తారని వెల్లడించారు. విజయ్ రాకతో హైదరాబాద్ వాలీబాల్ జట్టు బ్రాండ్ వాల్యూ మరోస్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News