ఫుట్ బాల్ చరిత్రలో ఇదే తొలిసారి... వైట్ కార్డ్ చూపించిన రిఫరీ

  • ఫుట్ బాల్ లో ఇప్పటిదాకా ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ అమలు
  • దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్ల కట్టడికి ఆయా కార్డులు
  • వైట్ కార్డ్ తీసుకువచ్చిన ఫిఫా
  • క్రీడాస్ఫూర్తితో వ్యవహరించే ఆటగాళ్లకు వైట్ కార్డ్
ప్రపంచంలో అత్యంత జనరంజక క్రీడ ఫుట్ బాల్. యూరప్, దక్షిణ అమెరికా, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇదొక మతం అనే స్థాయిలో ప్రజాదరణ పొందుతోంది. సాధారణంగా ఫుట్ బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు రిఫరీ కొన్నిసార్లు ఆటగాళ్లు మొరటుగా ప్రవర్తిస్తే స్థాయిని బట్టి ఎల్లో కార్డు (ఓ మోస్తరు ప్రవర్తన), రెడ్ కార్డు (అత్యంత తీవ్ర తప్పిదం) ఉపయోగిస్తుంటారు. 

ఓ ఆటగాడు మ్యాచ్ లో రెండు పర్యాయాలు ఎల్లో కార్డుకు గురైతే మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. రెడ్ కార్డుకు గురైన ఆటగాడు తక్షణమే మైదానాన్ని వీడాలి. ఇదీ ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ ల వెనుకున్న చరిత్ర. 

ఇక ఇవేవీ కాకుండా, ఫుట్ బాల్ లో వైట్ కార్డ్ కూడా ఒకటుంటుందన్న విషయం చాలామందికి తెలియదు. దీన్ని ఫిఫా ప్రవేశపెట్టినా, ఇప్పటివరకు ఉపయోగించే అవకాశం రాలేదు. మైదానంలో హుందాగా ఆడినందుకు, సుహృద్భావ పూరితంగా వ్యవహరించినందుకు వైట్ కార్డ్ చూపిస్తారు. 

సాకర్ చరిత్రలో తొలిసారిగా మ్యాచ్ రిఫరీ వైట్ కార్డ్ చూపించిన ఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మహిళా జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, గ్యాలరీలో కూర్చున్న ఓ ప్రేక్షకుడు అస్వస్థతకు గురికావడంతో ఇరుజట్ల వైద్యబృందాలు ఆ ప్రేక్షకుడి వద్దకు హుటాహుటీన చేరుకుని సేవలందించాయి. ఈ సమయంలో క్రీడాకారిణులు ఆ ప్రేక్షకుడి పరిస్థితి పట్ల స్పందించి మ్యాచ్ నిలిపివేశారు. 

అతడెలా పోతే మనకేంటి అన్నట్టుగా కాకుండా, అతడి పట్ల సానుభూతితో వ్యవహరించిన ఇరుజట్ల క్రీడాకారిణులను, సహాయక సిబ్బందిని అభినందిస్తూ రిఫరీ వైట్ కార్డ్ చూపించారు. ఫిఫా తీసుకువచ్చిన వైట్ కార్డ్ ను మ్యాచ్ సందర్భంగా ఉపయోగించడం ఇదే ప్రథమం.


More Telugu News