హిజాబ్ నిషేధం కేసు అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఓకే

  • విచారణకు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీజేఐ
  • కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టులో వాదనలు
  • పరీక్షల దృష్ట్యా అత్యవసర విచారణకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం  
కర్ణాటకలో హిజాబ్ నిషేధం వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం దీన్ని అత్యవసర విచారణ జాబితాలో చేర్చింది. అలాగే, ఈ కేసు కోసం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా.. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కోరారు. 

కర్ణాటకలోని ప్రభుత్వ కళాశాలల్లో హిజాబ్ నిషేధం కారణంగా చాలా మంది బాలికలు తరగతులకు హాజరు కావడం లేదన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ప్రైవేటు కాలేజీలకు షిఫ్ట్ అయ్యారని తెలిపారు. తలకు స్కార్ఫ్ ధరించడంపై ఆంక్షలు విధించిన కారణంగా ఒక సంవత్సరం నష్టపోయిన బాలికల ఉదంతాన్ని మీనాక్షి ప్రస్తావించారు. ఫిబ్రవరి 6న ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయని ఆమె తెలిపారు. 

‘చాలా మంది అమ్మాయిలు చదువు మానేయాల్సి వచ్చింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 16న ప్రారంభమవుతాయి. ఇంకో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ విషయంపై అత్యవసరంగా ఆదేశాలు కావాలి’ అని మీనాక్షి వాదించారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టు దీనిని పరిశీలించి, అత్యవసర విచారణ జాబితాలో చేరుస్తుందన్నారు. ఈ కేసుకు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటు చేస్తానని సీజేఐ అన్నారు.


More Telugu News