అంధకారంలో పాక్ నగరాలు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

  • పవర్ గ్రిడ్ ఫెయిల్యూరే కారణమని అధికారుల వివరణ
  • ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలలో పవర్ కట్
  • బలూచిస్థాన్ లోని 22 జిల్లాలకూ నిలిచిన విద్యుత్ సరఫరా
పాకిస్థాన్ లోని పలు నగరాలలో చీకట్లు అలముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇస్లామాబాద్, లాహోర్ లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సిటీలలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్ గ్రిడ్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ట్వీట్ చేసింది.

దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధ్రువీకరించాయని జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టాల నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని, దీంతో సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది. బలూచిస్థాన్ లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిందని పేర్కొంది. లాహోర్, కరాచీలోని పలు ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకున్నాయని అధికారులు వివరించారు. ఇస్లామాబాద్ లోని 117 గ్రిడ్ స్టేషన్లతో పాటు పెషావర్ లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.


More Telugu News