ఓటుకు వారు రూ. 3 వేలు ఇస్తే.. మేం రూ. 6 వేలు ఇస్తాం: బీజేపీ నేత బహిరంగ ప్రకటన

  • కర్ణాటకలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు 
  • ప్రత్యర్థి పార్టీ పంచుతున్న వస్తువుల విలువ రూ. 3వేలకు మించి ఉండదన్న మాజీ మంత్రి
  • తమ అభ్యర్థి రూ. 6 వేలు ఇవ్వకుంటే ఓటెయ్యెద్దన్న రమేశ్ జార్కిహోళి
  • ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న బీజేపీ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం సర్వ సాధారణమైన విషయమే. నగదు, మద్యం పంపిణీ చేస్తూ వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇదంతా లోలోపల రహస్యంగా జరిగే వ్యవహారం. అయితే, కర్ణాటకకు చెందిన బీజేపీ నేత మాత్రం బహిరంగంగానే అలాంటి ప్రకటన చేశారు. వారు కనుక ఓటుకు రూ. 3 వేలు ఇస్తే, మేం దానిని రెండింతలు చేసి రూ. 6 వేలు ఇస్తామని చెప్పి వివాదంలో చిక్కుకున్నారు. 

కర్ణాటకలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. బెళగావిలోని సులేబావిలో బీజేపీ నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హాజరైన మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి హోల్‌సేల్ మార్కెట్లో టిఫిన్ బాక్సులు, కుక్కర్లు చవగ్గా కొని ఓటర్లకు పంచుతున్నారని, మరికొన్ని కూడా పంచే అవకాశం ఉందన్న ఆయన వాటి విలువ మహా అయితే రూ. 3 వేలు ఉంటుందని, తమ అభ్యర్థి కనుక ఓటుకు రూ. 6 వేలు ఇవ్వకుంటే ఓటెయ్యెద్దని అభ్యర్థిస్తున్నానని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా, లైంగిక కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన 2021లో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

పార్టీకి సంబంధం లేదు: బీజేపీ
రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలను నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాటికి తమ పార్టీలో చోటు లేదన్నారు. బీజేపీ ఓ భావజాలంపై నిర్మితమైందని, అందుకనే అది రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో దేశంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రమేశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ అవినీతికి ఇది అద్దం పడుతోందని, ఎన్నికల సంఘం ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే డిమాండ్ చేశారు.


More Telugu News