పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారన్నది ముందే ఎలా చెప్పగలం?: వర్ల రామయ్య

  • జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • ఎంతమంది హాజరవుతారో తెలియజేయాలన్న డీజీపీ కార్యాలయం
  • జగన్ పాలనతో విసుగెత్తిన ప్రతి ఒక్కరూ వస్తారన్న వర్ల రామయ్య
  • పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా యాత్ర ఆగదని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు అందించాలని డీజీపీ కార్యాలయం టీడీపీ నేతలను కోరిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు ఎంతమంది హాజరవుతారు? పాదయాత్ర రూట్ మ్యాప్ ఏంటి? వంటి వివరాలతో నేడు టీడీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి రావాలని పోలీసు విభాగం స్పష్టం చేసింది. 

దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ పాలనతో విసుగెత్తిపోయిన ప్రతి ఒక్కరూ లోకేశ్ వెంట నడుస్తారని, అలాంటప్పుడు పాదయాత్రకు ఎంతమంది వస్తారో ముందే ఎలా చెప్పగలమని వ్యాఖ్యానించారు. 

లోకేశ్ పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డీజీపీదేనని స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర మాత్రం ఆగదని, అనుకున్న సమయానికే పాదయాత్ర జరిగి తీరుతుందని వర్ల రామయ్య పేర్కొన్నారు. పాదయాత్ర వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేస్తామని వెల్లడించారు.


More Telugu News