షారుక్ ఖాన్​ ఎవరు? అన్న ముఖ్యమంత్రి.. రాత్రి 2 గంటలకు ఆయనకు ఫోన్ చేసిన బాలీవుడ్ బడా హీరో

  • పఠాన్ చిత్రానికి వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు
  • అస్సాం సీఎం హిమంతకు ఫోన్ చేసిన షారుక్
  • సినిమాకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బాలీవుడ్ మెగాస్టార్ షారుక్ ఖాన్‌తో మాట్లాడానని చెప్పారు. ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న షారుక్ కొత్త చిత్రం 'పఠాన్'కి తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఒక థియేటర్‌లో జరిగిన సంఘటన గురించి షారుక్ రాత్రి 2 గంటలకు తనకు ఫోన్ చేశారని బిశ్వ శర్మ చెప్పారు.‘బాలీవుడ్ నటుడు షారుక్ నాకు ఫోన్ చేశారు. ఈ రోజు ఉదయం 2 గంటలకు మేం మాట్లాడాము. అయన తన సినిమా ప్రదర్శన సమయంలో గౌహతిలో జరిగిన సంఘటన గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని నేను ఆయనకు హామీ ఇచ్చాను. థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి మేము విచారిస్తాము. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం’ అని ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. 

కాగా, సినిమాకి వ్యతిరేకంగా ఓవర్గం చేస్తున్న హింసాత్మక నిరసనలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు షారుక్ ఖాన్ ఎవరని హిమంత అన్నారు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు? నాకు ఆయన గురించి, పఠాన్ చిత్రం గురించి ఏమీ తెలియదు’ అని పేర్కొన్నారు. షారుక్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అని చెప్పినప్పుడు, రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాల గురించి ఆందోళన చెందాలని, బాలీవుడ్ కాదు అని ఆయన అన్నారు. గౌహతిలో ‘పఠాన్’ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్న ఓ థియేటర్‌లో కొందరు కార్యకర్తలు సినిమా పోస్టర్లను చింపివేయడంపై ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షారుక్ నుంచి తనకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని. నటుడు ఫోన్ చేసి తనను కోరితే తాను ఆ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఎవరైనా నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షారుక్ కొన్ని గంటల్లోనే సీఎంకు ఫోన్ చేయడం గమనార్హం.


More Telugu News