మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు.. జూబ్లీహిల్స్‌లో కలకలం!

  • రెండు రోజుల క్రితం ఘటన.. తాజాగా వెలుగులోకి
  • అర్ధరాత్రి వేళ స్నేహితుడిని తీసుకుని మహిళా ఐఏఎస్ అధికారి ఇంటికెళ్లిన డిప్యూటీ తహసీల్దార్
  • ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానన్న నిందితుడు
  • అధికారిణి కేకలు వేయడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించిన భద్రతా సిబ్బంది 
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న ఓ మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ డిప్యూటీ తహసీల్దార్ చొరబడడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మహిళా ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆమె ట్వీట్లకు డిప్యూటీ తహసీల్దార్ (48) ఒకటి రెండుసార్లు రీట్వీట్లు చేశారు. 

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11.30 వేళ తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని తీసుకుని కారులో నేరుగా ఆమె ఉండే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లాడు. అక్కడ కాపలా సిబ్బందికి తాను పలానా వారి వద్దకు వెళ్లాలని చెప్పడంతో వారు అనుమతించారు. దీంతో స్నేహితుడిని కారులోనే ఉంచిన డిప్యూటీ తహసీల్దార్ ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన అధికారిణి ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో షాకయ్యారు. 

ఆ తర్వాత తేరుకుని.. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావని ప్రశ్నించారు. స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ గతంలో మీకు ట్వీట్ చేశానని, ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తక్షణం ఇక్కడి నుంచి వెళ్లాలని చెబుతూ కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.


More Telugu News