పక్కింటోళ్లపై పగబట్టిన మహిళ... 35 పావురాలపై విషప్రయోగం

  • బరేలీ నియోజకవర్గంలో ఘటన
  • పిల్లిని పెంచుకుంటున్న మహిళ
  • గత డిసెంబరులో పిల్లి మాయం
  • పొరుగంటివారిపై అనుమానం
  • ఇటీవల పొరుగింట్లో పెద్ద సంఖ్యలో పావురాల మృత్యువాత
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నియోజకవర్గం షాజహాన్ పూర్ లో మహిళ పొరుగువారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శాంతికి చిహ్నమైన పావురాలను కడతేర్చింది. షాజహాన్ పూర్ లోని జలాల్ నగర్ లో నివసించే వారిస్ అలీ (32) పావురాల శిక్షకుడు. అతడు తన ఇంటి టెర్రస్ పై 80 పావురాలను పెంచుతున్నాడు. వారి పక్కింట్లో ఓ మహిళ తన కుటుంబంతో నివాసం ఉంటోంది. ఆమె ఓ పిల్లిని పెంచుకుంటోంది. 

గత డిసెంబరు నుంచి ఆ పిల్లి కనిపించడంలేదు. పక్కింటోళ్లే దాన్ని మాయం చేసి ఉంటారని ఆమె అనుమానించింది. కొన్నిరోజుల కిందట వారిస్ అలీ నివాసంలో టెర్రస్ పై 35 పావురాలు చనిపోయిన స్థితిలో కనిపించాయి. దాంతో వారిస్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింటి మహిళ కుటుంబ సభ్యులే తన పావురాలపై విషప్రయోగం చేశారని ఆరోపించాడు. 

వారి పిల్లిని తాము అపహరించామని తప్పుడు ఆరోపణలు చేశారని, తాను కూడా జంతు ప్రేమికుడ్నే అని, అలా ఎందుకు చేస్తానని వారిస్ అలీ తెలిపాడు. పిల్లి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళ కుటుంబ సభ్యులు తమపై పగబట్టారని, పావురాలను చంపేస్తామని బెదిరించారని వెల్లడించాడు. 

ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ టెర్రస్ పైకి చేరుకుని విషం కలిపిన ధాన్యం గింజలు వేయడం తన కంటబడిందని ఆ పావురాల పెంపకందారు వివరించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న పావురాలు కళ్లముందే ప్రాణాలు విడిచాయని వారిస్ అలీ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. 

కాగా, మృతి చెందిన పావురాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతానికి సదరు మహిళపై సెక్షన్ 428 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


More Telugu News