కేంద్ర మంత్రి హామీతో ఆందోళన విరమించిన భారత రెజ్లర్లు

  • భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో మూడు రోజులుగా ఆందోళన
  • ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రి ప్రకటన
  • విచారణ జరిగే నాలుగు వారాల పాటు పదవి నుంచి దిగిపోవాలని బ్రిజ్ భూషణ్ కు ఆదేశం
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద మూడు రోజులుగా చేపట్టిన ధర్నాను భారత రెజ్లర్లు విరమించారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆందోళన విరమిస్తున్నట్టు రెజ్లర్లు ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సమాఖ్యలో ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణకు ముగ్గురు ప్రముఖ మాజీ క్రీడాకారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వారికి హామీ ఇచ్చారు. కమిటీలో ఇద్దరు మహిళలు ఉంటారని చెప్పారు. 

శనివారం ప్రకటించే ఈ కమిటీ నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తుందని అనురాగ్ తెలిపారు. అప్పటిదాకా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష బాధ్యతలకు బ్రిజ్ భూషణ్ దూరంగా ఉండాలని ఆదేశించారు. విచారణ పూర్తయ్యేంత వరకూ రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను కూడా కమిటీనే పర్యవేక్షిస్తుందని అనురాగ్ హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. మరోవైపు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత ఒలింపిక్ సంఘం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.


More Telugu News