జోడో యాత్రలో తొలిసారి జాకెట్ ధరించిన రాహుల్ గాంధీ

  • నిన్నటి దాకా టీషర్ట్ తోనే నడక సాగించిన కాంగ్రెస్ నేత
  • ప్రస్తుతం జమ్మూలో జోడో యాత్ర..  
  • చలిని తట్టుకునేందుకు జాకెట్ వేసుకున్న రాహుల్
నాలుగు నెలలుగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరగడం.. ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్మూలోని కతువాలో జాకెట్‌ ధరించి యాత్రలో కనిపించారు.

చలి ఎక్కువగా ఉన్నా సరే కేవలం టీ ష‌ర్ట్ మాత్రమే వేసుకుని నిన్నటి దాకా జోడో యాత్రను రాహుల్ కొనసాగించారు. దీంతో రాహుల్ యాత్రపై కన్నా ఆయన వేసుకున్న టీషర్ట్ పైనే ఎక్కువ చర్చ జరిగింది.. టీషర్ట్ ధర ఎక్కువని, టీషర్ట్ లోపల థర్మల్ ఉంచుకున్నారని విమర్శలు వచ్చాయి.

మీకు చలి అనిపించడం లేదా? అని మీడియా ప్రతినిధులు అడిగితే.. ‘‘భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత.. ‘టీ షర్ట్ ధరించి చలిని ఎలా తట్టుకోవటం’ అనే వీడియో రూపొందిస్తా’’ అని రాహుల్ చమత్కరించారు. తనకు ఢిల్లీలో చలి పెద్దగా అనిపించడం లేదని, ఒకవేళ చలి అనిపిస్తే స్వెట్టర్ గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు.

మరో సందర్భంలో.. ‘‘కేరళలో చాలా వేడిగా అనిపించింది. మధ్యప్రదేశ్‌కి రాగానే కాస్త చలిగా అనిపించింది. యాత్ర సమయంలో చినిగిన దుస్తులతో చలిలో వణుకుతున్న ముగ్గురు పేద పిల్లలు నా దగ్గరికి వచ్చారు. నేను కూడా చలికి వణికేంత వరకు కేవలం టీషర్ట్‌ మాత్రమే ధరించాలని ఆ రోజే నిర్ణయించుకున్నా’’ అని రాహుల్ చెప్పారు.


More Telugu News