కాంగ్రెస్ లోకి పెద్ద కరోనా వచ్చింది.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు

  • సచిన్ పైలట్ పై పరోక్ష విమర్శ.. వీడియో వైరల్!
  • గెహ్లాట్, పైలట్ మధ్య ముదురుతున్న వివాదం
  • ఒకరిపై మరొకరు తరచూ విమర్శలు
రాజస్థాన్ లో అధికార పక్షంలోనే ఉప్పు- నిప్పు అన్నట్లు ఉన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఇద్దరు నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తరచూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సొంత ప్రభుత్వంపై సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెహ్లాట్.. సచిన్ పైలట్ ను పరోక్షంగా కరోనా వైరస్‌తో పోల్చారు. 

ఇటీవల ఉద్యోగ సంఘం ప్రతినిధులతో అశోక్ గెహ్లాట్ ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గెహ్లాట్‌ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందని అనగానే సమావేశంలో ఉన్నవాళ్లందరూ పెద్దపెట్టున నవ్వేశారు. ఉప ఎన్నికలు ఉన్నా, రాజ్యసభ ఎన్నికలు ఉన్నా తమ ప్రభుత్వం ఉద్యోగుల సహకారంతో అద్భుతమైన పథకాలు తెచ్చిందని అన్నారు.

ఉద్యోగుల సంఘం ప్రతినిధుల్లో ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రాజస్థాన్ సీఎం.. ‘‘నేను మీటింగ్ ప్రారంభించాను.. గతంలో కరోనా వచ్చింది.. మా పార్టీలోకి కూడా ఓ పెద్ద కరోనా ప్రవేశించింది’’ అని అన్నారు. ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించకున్నా.. సచిన్ పైలట్ నే విమర్శించారనే చర్చ జరుగుతోంది. అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News