చిరంజీవి మా పార్టీలోనే ఉన్నారు: ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

  • రాహుల్, సోనియాతో చిరంజీవికి మంచి సంబంధాలున్నాయన్న రుద్రరాజు
  • వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి
  • జగన్ నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శ
మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. ఒంగోలులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేస్తుందన్నారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని అన్నారు. ఎన్నికల కోసం జిల్లా కమిటీలు, నాయకులను సిద్ధం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు  నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కాగా, ఒంగోలులో నిన్న నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మెయ్యప్పన్, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ తదితరులు  పాల్గొన్నారు.


More Telugu News