26న బెంగాల్ గవర్నర్‌కు అక్షరాభ్యాసం.. హాజరు కానున్న మమతా బెనర్జీ!

  • ఈ నెల 26న రాజ్‌భవన్‌లో అక్షరాభ్యాసం
  • హాజరు కానున్న మమతా బెనర్జీ
  • బెంగాలీలో పుస్తకం రాయాలన్న యోచనతోనే భాష నేర్చుకుంటున్న గవర్నర్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అక్షరాభ్యాసానికి సిద్ధమవుతున్నారు! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా, ఇదే నిజం. ఈ నెల 26న సరస్వతీ పూజను పురస్కరించుకుని మమతా బెనర్జీ సమక్షంలో రాజభవన్‌లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పలక, బలపం పట్టి గవర్నర్ బెంగాలీ అక్షరాలు దిద్దుతారు. 

ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్ బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని యోచిస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇందుకోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా చిన్నారులకు ‘హతేఖోరీ’ పేరుతో నిర్వహించే సంప్రదాయ అక్షరాభ్యాస తంతును గవర్నర్‌కు నిర్వహిస్తారు. 

ఇదిలావుంచితే, మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆనందబోస్ జన్మతః మలయాళీ. ఆయన తండ్రి వాసుదేవన్ నాయర్ కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎనలేని గౌరవం. అందుకే, తన పిల్లలందరి పేర్లకూ చివర బోస్ అనే పేరు పెట్టారు. దీంతో ఆనందబోస్ ను బెంగాలీ అనుకుని పొరబడేవారు కూడా వున్నారు!


More Telugu News