మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ... మండిపడుతున్న కేంద్రం

  • 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' పేరిట బీబీసీ కథనం
  • గుజరాత్ అల్లర్ల అంశం ప్రస్తావన
  • దురుద్దేశపూర్వకంగా కథనం రూపొందించారన్న కేంద్రం
  • దీని వెనుక అజెండా ఉందన్న విదేశాంగ శాఖ
బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇటీవల ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీ రూపొందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివాదాస్పదమైన ఓ అంశాన్ని ఎత్తిచూపడానికి ఉద్దేశపూర్వకంగా ఈ కథనం రూపొందించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా విమర్శించింది. 

వివక్ష, విషయ పరిజ్ఞానం లోపించడం, వలసవాద ఆలోచనా ధోరణికి కొనసాగింపు తదితర అంశాలు ఈ డాక్యుమెంటరీ ద్వారా తేటతెల్లమవుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్జి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2020 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఓ అజెండా ప్రకారమే బీబీసీ కథనం రూపొందించారని ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీ భారత్ లో చిత్రీకరించలేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలని తెలిపారు. 

కట్టుకథలను, కల్పిత ప్రచారాన్ని తిరిగి తెరపైకి తీసుకురావాలన్న సదరు వార్తాసంస్థ, కొందరు వ్యక్తుల ఆలోచనకు ఈ కథనం ప్రతిబింబం వంటిదని ఆరిందమ్ బాగ్చి అభివర్ణించారు. ఈ కసరత్తు వెనుక ఉద్దేశం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోందని, అయితే ఇలాంటి ప్రయత్నాలను ఎప్పటికీ గౌరవించబోమని స్పష్టం చేశారు. 

కాగా, ఇదే బీబీసీ కథనాన్ని బ్రిటీష్ పార్లమెంటులో ప్రస్తావించిన పాకిస్థాన్ సంతతి ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ పై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మండిపడ్డారు. ఈ అంశం (గుజరాత్ అల్లర్లు)పై బ్రిటన్ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, సుదీర్ఘకాలంగా బ్రిటన్ ఈ ధోరణికే కట్టుబడి ఉందని రిషి సునాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారు. తద్వారా మోదీకి మద్దతు పలికారు.


More Telugu News