టీమిండియాకు ఆడకపోయినా బ్రాడ్ మన్ రికార్డుకు చేరువయ్యాడు!

  • దేశవాళీల్లో పరుగుల వెల్లువెత్తిస్తున్న సర్ఫరాజ్ ఖాన్
  • టీమిండియా తరఫున ఆడే చాన్స్ కు నోచుకోని వైనం
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండో అత్యుత్తమ సగటు నమోదు
  • బ్రాడ్ మన్ సగటు 95.14 ..సర్ఫరాజ్ సగటు 80.47
దేశవాళీ క్రికెట్ లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీతో పాటు ఇతర దేశవాళీ టోర్నీల్లో పరుగులు వెల్తువెత్తిస్తున్న ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ ఇప్పటికీ టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. సెలెక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ సైతం తనను టీమిండియాకు ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. 

ఇక అసలు విషయానికొస్తే... క్రికెట్ ప్రపంచంలో డాన్ బ్రాడ్ మన్ అంటే ఒక శిఖరం. ఆస్ట్రేలియాకు చెందిన ఆ మహోన్నత క్రికెటర్ ఆటలో నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అయితే, టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ లెజెండ్ బ్రాడ్ మన్ రికార్డుకు చేరువ కావడం విశేషం. 

ప్రపంచంలో ఏ దేశవాళీ క్రికెట్ చూసినా అత్యుత్తమ బ్యాటింగ్ సగటు డాన్ బ్రాడ్ మన్ పేరిట ఉంది. ఆయన ఆసీస్ దేశవాళీ పోటీల్లో 95.14 పరుగుల సగటు నమోదు చేశాడు. ఆయన తర్వాత స్థానంలో ఉన్నది ఎవరో కాదు... మన సర్ఫరాజ్ ఖానే. భారత దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ సగటు 80.47. 

క్రికెట్లో 50 సగటు అంటేనే అదో గొప్ప ఘనతగా, అతడొక నిలకడైన ఆటగాడిగా భావిస్తారు. అలాంటిది 80 పైచిలుకు సగటు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. సర్ఫరాజ్ ఖాన్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో ఈ సగటే చెబుతోంది. 

సర్ఫరాజ్ ఖాన్ 2019-20 రంజీ సీజన్ లో 928 పరుగులు, 2021-22 సీజన్ లో 982 పరుగులు చేశాడు. 2022-23 సీజన్ లో ఇప్పటికే మూడు భారీ సెంచరీలతో ప్రకంపనలు సృష్టించాడు. ఇంతజేసీ, టీమిండియాలో ఆడే చాన్సులు రాకపోవడం బాధాకరం. 

కాగా, బ్రాడ్ మన్ రికార్డును సమీపించడంపై సర్ఫరాజ్ ఖాన్ స్పందించాడు. దిగ్గజ ఆటగాడి రికార్డును తాను సమీపించడం సంతోషం కలిగిస్తోందని అన్నాడు. గత మూడు సీజన్ల నుంచి తాను రాణిస్తున్నానని వెల్లడించాడు. 

25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటిదాకా 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 80.47 సగటుతో 3,380 పరుగులు చేశాడు. వాటిలో 12 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 301 నాటౌట్.


More Telugu News