గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగులకు లేదు: ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు

  • ఇవాళ గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు
  • ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు
  • ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలన్న బండి శ్రీనివాసరావు
  • లేకపోతే ప్రభుత్వం గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని వ్యాఖ్య 
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ఎన్జీవో సంఘం మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఇవాళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మరికొన్ని ఇతర ఉద్యోగుల సంఘాలు గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరిపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 

అయితే, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు దీన్ని ఖండించారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగులకు లేదని అన్నారు. ఉద్యోగ సంఘాలు నియమనిబంధనలు పాటించాలని, లేని పక్షంలో గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ఎన్జీవోలు ముఖ్యమంత్రి మెప్పుకోసం పనిచేస్తున్నారని సూర్యనారాయణ అనడం సరికాదని బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ వెనుక ఎవరు ఉన్నారో, ఏ శక్తి ఆయనను నడిపిస్తోందో ఉద్యోగులు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చాలా ఓపికపట్టామని, ఇకపైనా ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

"ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపును సూర్యనారాయణ దొంగచాటుగా తెచ్చుకున్నారు. తన డిపార్ట్ మెంట్ లో సూర్యనారాయణ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు" అని ఆరోపించారు. 

తామేమీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో పీఆర్సీని తెచ్చుకోలేదని, పోరాటం సాగించి తెచ్చుకున్నామని బండి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. సమస్యలపై పోరాడలేక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఇవాళ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారని విమర్శించారు.


More Telugu News